వాతావరణంలో ప్రస్తుత పెను మార్పులు ఆఫ్రికా ఖండాన్నే అల్లకల్లోలం చేయనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రోఫెసర్ సర్ గోర్డోన్ కోన్వె వెల్లడించారు. ఆఫ్రికాలో ప్రస్తుతం ఉన్నదానికన్నా ఇంకా అత్యంత దారుణంగా ఆహార కొరత పెరగనుందని.. అక్కడి ఉష్ణోగ్రతలు కూడా అంచనాలకు మించి పెరిగిపోనున్నట్లు ఆయన తెలిపారు.
బ్రిటన్ అంతర్జాతీయ అభివృద్ధి విభాగపు ప్రధాన శాస్త్రవేత్త మరియు రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు అయిన గోర్డోన్ కోన్వే తాజాగా తన సిద్ధాంతాన్ని శాస్త్రీయ పత్రంలో వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతల సగటుతో పోల్చితే.. ఆఫ్రికాలోని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లుగా సంకేతాలు లభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీని వల్ల అక్కడి ప్రజలు ఎనలేని కరువుకాటకాలు, తుఫాన్లు తరచుగా చూడనున్నారని చెప్పారు. అంటువ్యాధులు విస్తరిస్తాయని.. వ్యవసాయ భూములు దెబ్బతిని కటిక బీదరికాన్ని అక్కడి ప్రజలు ఎదుర్కోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ వేసవి దినాలు ఎక్కువగా.. శీతాకాల దినాలు తక్కువగా ఉంటున్నాయని గుర్తు చేశారు.
వచ్చే వందేళ్ల కాలంలో.. ఆఫ్రికాలో ఇప్పటి కన్నా నాలుగు డిగ్రీల అధికంగా ఎక్కువ వేడిమి పెరగనుంది. ఇప్పటికే.. 20 ఏళ్లుగా కరువు కారణంగా ఆహార కొరతను ఎదుర్కొంటున్న తూర్పు ఆఫ్రికా, ఈశాన్య ఆఫ్రికాలలోని సోమాలియా, ద్జిబూతీ, ఎరిత్రియా, ఇథియోపియోలలోని ప్రాంతాల పరిస్థితి మరింతగా దిగజారుతుందన్నారు.
మరోవైపు జనాభా పెరుగుదలతో ఇప్పిటి కంటే కూడా భవిష్యత్తులో అక్కడ 70 శాతం కన్నా ఎక్కువగా ఆహారం అవసరమవుతుందన్నారు. ఇప్పటికైనా మేల్కొని.. ఆఫ్రికా నేలల్లో క్షీణించిపోయిన సేంద్రియ పదార్థాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి లభ్యతను కూడా మెరుగుపరచాలన్నారు. వాతావరణ మార్పుపై ఇప్పటి నుంచి ఓ సరైన పరిశోధన అవసరమన్నారు.