భారత్‌లో అడుగుపెట్టేందుకు అమెరికా విశ్వవిద్యాలయాలు, అనేక విద్యాసంస్థలు ఎనలేని ఆసక్తిని కనబరుస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించే చట్టం ఆమోదం కోసం అమెరికా యూనివర్శిటీలు ఎదురుచూస్తున్నట్లు సిబాల్ తెలిపారు.
అమెరికాలో వారం రోజుల సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన సందర్భంగా భారతీయ విలేకరులతో సిబాల్ మాట్లాడుతూ, తాము ఈ పర్యటనలో అనేక ప్రధాన విశ్వవిద్యాలయాల అధ్యాపకులను కలిశామన్నారు. ఈ పర్యటనలో తాము.. హార్వర్డ్ యూనివర్శిటీ, బోస్టన్ యూనివర్శిటీ, యేల్ యూనివర్శిటీ, ఎంఐటీ తదితర ప్రముఖ అమెరికా యూనివర్శిటీ అధ్యక్షులతో సమావేశమయినట్లు కూడా తెలిపారు.
అలాగే అమెరికా విద్యాశాఖ కార్యదర్శి అర్నీ డంకన్ మరియు ఇద్దరు నేతలను సిబాల్ కలుసుకున్నారు. భారత-అమెరికా విద్యా మండలిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు సిబాల్ వివరించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమెరికా యూనివర్శిటీ అత్యున్నత స్థాయి ప్రతినిధులతో సిబాల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్‌లో ఉన్నత విద్యారంగం మరింతగా పుంజుకునేందుకు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మండలి పనిచేస్తుందని సిబాల్ వ్యాఖ్యానించారు. ఈ మండలిలో సభ్యులుగా.. అమెరికా యూనివర్శిటీ అధికారులు మరియు ఇతర విద్యా సంస్థల ప్రతినిధులు ఉంటారన్నారు.