ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో కర్జాయ్ విజయం (Afghanistan | President | Election | Karzai | Victory | UN | Ban Ki Moon)
ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో కర్జాయ్ విజయం
మంగళవారం, 3 నవంబర్ 2009( 09:30 IST )
ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో హమీద్ కర్జాయ్ మళ్ళీ విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆఫ్గన్ స్వతంత్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు ఈ వారాంతంలో జరగాల్సి ఉంది. అయితే, కర్జాయ్‌పై పోటీకి దిగిన మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా పోటీ నుంచి తప్పుకున్నారు. ఫలితంగా.. కర్జాయ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఆఫ్ఘన్ అధ్యక్షునిగా కర్జాయ్ వచ్చే ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతారని ఎన్నికల సంఘం ఛైర్మన్ అజీజుల్లా లూడిన్ వెల్లడించారు. ఫలితాల ప్రకటనపై ఆయన సోమవారం కాబూల్‌లో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 20న జరిగిన తొలి దఫా పోలింగులోనే కర్జాయ్‌కు అనుకూలంగా అధిక ఓట్లు లభించాయని లూడిన్ వివరించారు.
ఇదిలావుండగా, రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్న ఆఫ్గనిస్తాన్ అభివృద్ధికి చేయూతనందిస్తామని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. ఇందుకోసం కర్జాయ్, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లాతోను చర్చలు జరిపేందుకుగాను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ సోమవారం కాబూల్‌కు చేరుకున్నారు.
ఐక్యరాజ్యసమితి అతిథి గృహం మీద దాడులు జరిగి దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో జరుగుతున్న మూన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆఫ్గనిస్తాన్ ప్రజల్లో భరోసా కల్పించడమే మూన్ పర్యటన ప్రధాన లక్ష్యమని ఐరాస విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.