ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » రాజధాని టెహ్రాన్‌ను మార్చే యోచనలో ఇరాన్ ప్రభుత్వం (Iran | Capital | Tehran | Earthquake | International | President | Balm City | Iraq)
ఇరాన్ ప్రభుత్వం తమ దేశ రాజధాని టెహ్రాన్‌ను మార్చే దిశగా ఆలోచన చేస్తోంది. తరచూ సంభవించే భూకంపాల భయంతో రాజధాని వాసులతో పాటు.. పాలకులు కూడా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.
గత 2003లో వాయువ్య బామ్ నగరంలో సంభవించిన భారీ భూకంపంలో దాదాపు 40 వేల మంది మరణించారు. నాటి నుంచి రాజధాని నగరాన్ని మార్చాలన్న యోచన నానుతూ వస్తోంది. తాజాగా సమీప భవిష్యత్తులో టెహ్రాన్‌లో మరో భారీ భూకంపం సంభవించవచ్చని సెస్మాలజిస్టులు (భూకంపాలను పసిగట్టే నిపుణులు) హెచ్చరిస్తున్నారు.
దీంతో రాజధాని నగరాన్ని మార్చాలని దేశాధినేత అయతుల్లా ఖొమైనీ ప్రతిపాదించడం గమనార్హం. ఖొమైనీ ప్రతిపాదనకు ఎక్స్‌పీడియన్సీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతమున్న నగరాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం లేదా కొత్త నగరాన్ని రాజధానిగా ప్రకటించడం ప్రభుత్వ యోచనగా ఉంది.
గతంలో ఇస్ఫాహాన్, ఖజ్వీన్, షిరాజ్, మషాద్, హమేదాన్ రాజధానులుగా ఇరాన్ పాలన సాగింది. ఈ క్రమం 1795 వరకు కొనసాగింది. ఖజార్ రాజు అఘామహమ్మద్ ఖాన్ 1795లో టెహ్రాన్‌ను రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి ఇరాన్ రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలకు టెహ్రాన్ వేదికగా నిలిచింది.