ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కొత్త ప్రభుత్వంలో ప్రత్యర్థులకు కూడా స్థానం: కర్జాయ్ (Afghanistan | Hameed karzai | New Govt | Abdulla | Contest | Election)
కొత్త ప్రభుత్వంలో ప్రత్యర్థులకు కూడా స్థానం: కర్జాయ్
బుధవారం, 4 నవంబర్ 2009( 09:08 IST )
దేశ అభివృద్ధి, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ప్రత్యర్థులకు కూడా స్థానం కల్పిస్తామని మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా ఆవిర్భవించే కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రత్యర్థి నేతలను తాను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
ఆఫ్గన్ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. అనంతరం ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని నలుచెరగులా విస్తరించిన పౌరులంతా పాలనలో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పాలనాయంత్రాంగానికి సహకరించేందుకు సిద్ధమన్న తాలిబాన్లను, రాజకీయ ప్రత్యర్థులను నూతన ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో తనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పని చేసిన ఎవరితోనైనా చేతులు కలిపి దేశ అభివృద్ధికోసం పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదిలావుండగా, ఆఫ్గన్ అధ్యక్షుడిగా కర్జాయ్ మరోమారు ఎన్నిక కావడం పట్ల అటు అమెరికా, ఇటు రష్యా అగ్రనేతలు ఆయనకు ఫోను చేసి అభినందలు తెలిపారు.