ఖాట్మండులో శుక్రవారం నుంచి భారత్, నేపాల్‌లకు చెందిన హోం శాఖ కార్యదర్శుల ఉన్నత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించి చేసుకోవలసిన ఒప్పందంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ప్రస్తుతం ప్రస్తుత పరిణామాలను పరిగణలోకి తీసుకుని భారత, నేపాల్ సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రత, మరియు దాని నిర్వహణ వ్యూహాన్ని సైతం ఈ సమావేశాల్లో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల కోసం గురువారం సాయంత్రమే భారత హోం శాఖ ప్రధాన కార్యదర్శి జీకే పిళ్లై ఖాట్మండు చేరుకున్నారు.
భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలను చేపట్టే వారిని తీవ్రంగా పరిగణించి.. అలాంటి వాటిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా ఈ సమావేశం సందర్భంగా పిళ్లై కోరే సూచనలు కనిపిస్తున్నాయి. నేరస్థుల సమాచారం పరస్పరం అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై పరిశీలిస్తారు.
అన్నింటికంటే ముందుగా.. మావోయిస్టుల సంబంధిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, నకిలీ కరెన్సీ, స్మగ్లర్లు తదితర సమస్యలను విఫులంగా ఈ సమావేశంలో ఇరు దేశాల కార్యదర్శులు చర్చిస్తారు. కాగా, తూర్పు కాట్మండులోని పనౌటి వద్ద ఒక పోలీసు అకాడెమీని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ పడొచ్చు. అలాగే భరత్‌పూర్‌లోను నేపాల్ పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తారు.