బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గెలిచిన షేక్ ముజీబ్-ఉర్-రెహ్మాన్‌ను హతమార్చిన ఐదుగురు నిందితులకు దేశంలోని ఉన్నత న్యాయస్థానం వారికి ఉరిశిక్షను విధించింది.
34 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కోసం పోరాడి గెలిచిన షేక్ ముజీబ్-ఉర్-రెహ్మాన్‌ను నిర్దాక్షిణ్యంగా హతమార్చారు.
గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం 12 మంది సైనికాధికారులను పదవీచ్యుతులనుగావించింది. ఈ పన్నెండు మందిలో ఉరిశిక్ష పొందిన ఈ ఐదుగురు ఉండటం గమనార్హం. వీరిని 1975లో జరిగిన హత్యాకాండకు దోషులుగా కోర్టు నిర్ధారించింది. గురువారం సుప్రీం కోర్టు భారీ భద్రత నడుమ వీరికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు 15 నిమిషాల చర్చల అనంతరం ప్రకటించింది.
1998లో క్రింది కోర్టు వీరికి ఉరిశిక్ష విధించాలని తీర్మానించింది. దీంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు అదే శిక్షను అమలు చేయాలని గురువారం తీర్మానించింది. అలేగా మిగిలిన ఏడుగురిని పారిపోయిన ఖైదీలుగా తీర్మానించింది.
"బంగబంధు" పేరుతో ప్రసిద్ధి చెందిన ముజీబ్-ఉర్-రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఈ పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. 15 ఆగస్టు 1975లో ధన్‌మండీ ప్రాంతంలోనున్న ఆయన ఇంట్లోనున్న సమయంలో ఆయనతోపాటు ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులను దుండుగులు తుపాకులతో కాల్చి చంపారు.
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనాతోపాటు ఆమె చెల్లెలు రెహానా ఆ సమయంలో విదేశంలో ఉండటంతో వారు బ్రతికిపోయారు.