బలూచిస్థాన్, వజీరిస్థాన్‌లలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులకు భారత్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) తాజాగా ఆరోపించింది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఐఎస్ఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరక్టర్ లియోన్ పనెట్టా పాక్ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చారు. ఆయన పాక్ పర్యటనలో ఉండగా, ఈ ఆధారాలను ఐఎస్ఐ చీఫ్ అహమ్మద్ షుజా పాషా సీఐఏ అధిపతికి అందజేశారని ఐఎస్ఐ పేర్కొంది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాకిస్థాన్‌కు సహాయం చేయడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని జనరల్ పాషా విమర్శలు గుప్పించారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద వర్గాలు పాకిస్థాన్‌లో సమస్యలు సృష్టిస్తున్నాయని, వారి కార్యకలాపాలపై విశ్వసనీయమైన సమాచారం అందించడంలో సీఐఏ విఫలమైందని ఐఎస్ఐ చీఫ్ తెగేసి చెప్పినట్టు సమాచారం.
తీవ్రవాదమే ఒక అస్త్రంగా చేసుకుని పాకిస్థాన్ వ్యవహరిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా ఆరోపించారు. గత మూడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ సతమతమవుతోందని, దీన్ని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలే ఐఎస్ఐ తాజాగా భారత్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం.