ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బొగ్గు గనిలో పేలుడు: 104కు పెరిగిన మృతులు (Mine blast | China | Death toll | State media | Hegang | Xinhua news)
చైనాలోని ఒక బొగ్గుగనిలో శనివారం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడిన వారి సంఖ్య 104కు చేరుకున్నట్టు స్థానిక అధికారులు సోమవారం వెల్లడించారు. చైనా అధికారిక వార్తా పత్రిక జినువా న్యూస్ ఏజెన్సీ అందించిన సమాచారం మేరకు గని శిథిలాల కింద మరో నలుగురు ఇంకా చిక్కుకుని ఉన్నట్టు తెలిపింది. కాగా, ఈ ప్రమాదం ఈశాన్య చైనాలోని హెగాంగ్ అనే ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిన విషయం తెల్సిందే.
రష్యా సరిహద్దు సమీపంలో ఉన్న హెలోగ్‌జింగ్ ప్రొవియన్స్‌లోని అతిపెద్దదైన, పురాతమైన బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో 528 మంది కార్మికులు ఉన్నట్టు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వర్క్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. 2007 డిసెంబరులో షాంక్సి ప్రొవియన్స్‌లో జరిగిన పేలుడులో 105 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ పేలుడు తర్వాత అంతటి స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.