ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బలూచిస్థాన్‌లో భారత్ పాత్రపై ఆధారాల సేకరణ: పాక్ (Pakistan | India | Balochistan | America | Terrorist | 26/11 attacks)
బలూచిస్థాన్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోమారు ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను తాము సేకరిస్తున్నట్టు ఆ శాఖామంత్రి షా మొహ్మద్ ఖురేషీ తెలిపారు. దీనిపై ఆయన సోమవారం లాహోర్‌లో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాల్లోని అల్లరి మూకలను భారత్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. స్పష్టమైన ఆధారాలు తమకు లభించడం వల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికైనా భారత్ ఈ చర్యలకు స్వస్తి పలకాలని ఆయన గట్టిగా కోరారు. అలాకాని పక్షంలో దక్షిణాసియాలో శాంతి స్థాపన అసాధ్యమన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని, శాంతి స్థాపనను చూడాలని భావించే వారు ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చలకు ముందుకు రావాలని ఆయన కోరారు.
ముంబై దాడులకు సంబంధించి ఏడుగురు లష్కర్ తోయిబా తీవ్రవాదులను అరెస్టు చేసినప్పటికీ... ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారత్ తిరస్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. తీవ్రవాదంపై పాక్ చేపడుతున్న చర్యలకు భారత్ తన వంతు మద్దతును ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.