ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » చర్చల ప్రతిపాదనకు ముందు చర్యలు చేపట్టండి: ప్రధాని (PM | Manmohan | Zardari | Terrorism | Pakistan | India | Lashkar)
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో భాగంగా ముఖాముఖి చర్చలు జరపాలని పాక్ పాలకులు పదేపదే వ్యాఖ్యానించడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఈ చర్చల ప్రతిపాదన తెచ్చే ముందుగా.. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన హితవు పలికారు. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదనతో ముందుకు రావాలని ఆయన సెలవిచ్చారు. అప్పటి వరకు ఇరు దేశాల మధ్య చర్చలకు ఆస్కారమే లేదని ఆయన తేల్చి చెప్పారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సోమవారం వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో సైన్యం చాలా శక్తివంతంగా ఉందని, అందువల్ల ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తమకు అర్థం కావడం లేదన్నారు. ముంబై దాడులతో సంబంధం ఉన్న వారంతా పాక్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారన్నారు.
తీవ్రవాదం/ఉగ్రవాదంపై పోరుకు పాక్ పాలకులు నిజంగా నిబద్ధతత కలిగివుంటే ముంబై దాడుల కేసు ఎపుడే చివరి దశకు వచ్చి ఉండేదన్నారు. కానీ, అది వాస్తవంగా జరగలేదన్నారు. అందుకే, ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొనడం ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ విషయంలో కూడా పాక్ అనుసరిస్తున్న విధానాలు, లక్ష్యాలు కూడా సముచితంగా, సామరస్య పూర్వకంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు.