దాయాది దేశం పాక్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు స్నేహాస్తం అందించేందుకు సంకేతాలు పంపారు. దృఢనమ్మకం, నిజాయితీతో వివాదాస్పద అంశాలపై చర్చకు రావాలని ఆయన పాకిస్థాన్‌కు సూచించారు. అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ఆయన సోమవారం జరిగిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ఇందుకు పాకిస్థాన్ నిజాయితీని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, తీవ్రవాదానికి పాక్ చరమగీతం పాడాలని ఆయన నొక్కివక్కాణించారు. తమ దేశంతో చర్చలకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు భారత్, అమెరికా దేశాలు పారదర్శకంగా పని చేస్తున్నాయన్నారు. ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవడమే అంతర్జాతీయ సమాజం ముందున్న ప్రస్తుత సవాల్ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.