ఈ దఫా అమెరికాకు వచ్చినపుడు తమ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అగ్రదేశం అమెరికా సూచించింది. ఈ మేరకు... అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆమె సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎన్నో విలువలకు కట్టుబడి భారత్ పని చేస్తోందని అన్నారు. టిబెటెన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పట్ల భారత్ చూపుతున్న ప్రేమానురాగాల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు (ప్రధాని) మళ్లీ అమెరికాలో పర్యటించాలని కోరుకుంటున్నాను. ఈ దఫా వచ్చినపుడు మా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి. భారత్, అమెరికా దేశాల మధ్య మున్ముందు సుహృద్భావ వాతావరణం, సంబంధాలు మరితంగా బలపడాలని ఆమె ఆకాక్షించారు.
ముఖ్యంగా.. మన్మోహన్ అమెరికా పర్యటన భారత్-అమెరికా దేశాల మధ్య సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదంపై మరింత లోతుగా చర్చించేందుకు ఈ పర్యటన మరింత ఉగయోపడుతుందని ఆమె చెప్పారు.