అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు అమెరికా-భారత్‌లు కలిసి ఉమ్మడి పోరు సాగిస్తాయని అగ్రదేశం అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. తమ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తన అధికార భవనం శ్వైతసౌధంలో సమావేశమయ్యారు. వీరిద్దరు ఉగ్రవాదం, అణు ఒప్పందం, ఆర్థిక మాంద్యం, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వీరిద్దరు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదుగుతోందని కితాబిచ్చారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కొనసాగిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక పౌర అణు ఒప్పందం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని, అందువల్ల త్వరలోనే ఇది కార్యరూపందాల్చుతుందని హామీ ఇచ్చారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా, ఇరు దేశాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. తన అమెరికా పర్యటన, అధ్యక్షుడితో సహా ఇతర ప్రభుత్వాధినేతలతో జరిపిన చర్చలు పూర్తి సంతృప్తి నిచ్చాయని చెప్పుకొచ్చారు.