దాయాది దేశాలైన పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉన్న సమస్యలు వారి సొంత వ్యవహారమని, వాటిని ఆ రెండు దేశాలే కలిసి పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే, పాకిస్థాన్ ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు మాత్రమే తాము పాక్‌కు సాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరు చేపట్టిందన్నారు. ఇతరుల కోసం కాకపోయినా తమ (పాక్) రక్షణకోసమైన ఆ దేశం ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇకపోతే.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సమస్యలను ఆ రెండు దేశాలే శ్రద్ధ చూపి పరిష్కరించుకోవాలని కోరారు.
భారత ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆయన శాంతికాముకుడిగా కొనియాడారు. అలాగే, భారతదేశం బాధ్యతతో వ్యవహరించే దేశంగా ప్రశంసించారు. మానవాళికి శత్రువులుగా మారిన ఉగ్రవాదం, పర్యావరణం వంటి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. అంతేకాకుండా, ప్రపంచ రాజకీయ రంగంలో భారతదేశానిది ఆదర్శప్రాయమైన మార్గమని ఒబామా అభిప్రాయపడ్డారు.