ఆస్ట్రేలియాలో దాడికి గురైన భారతీయ యువకుడు కన్నుమూశాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ యువకుడు ప్రాణాలు విడిచినట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని భారతీయులపై గత కొంతకాలంగా జరుగుతున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తొలి యువకుడు ఇతనే కావడం గమనార్హం.
పంజాబ్‌కు చెందిన నితిన్ గార్క్ (21) అనే యువకుడు పనికి వెళుతుండగా, ఒక పార్కు సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ జాయింట్ హంగ్రీ జాక్స్ రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ రెస్టారెంట్‌లో నితిన్ గార్క్ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు.
సొమ్‌ర్విల్లీ రోడ్డు, జీలాంగ్ రోడ్డులకు ఓ మూల భాగాన ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ సమీపంలో శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన నితిన్ సాయం చేయాలని ఆర్తనాదాలు చేశారు.
దీన్ని గుర్తించిన కొందరు స్థానికులు రాయల్ మెల్‌బోర్న్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు కోల్పోయినట్టు టీవీ వర్గాలు వెల్లడించాయి. న్యూపోర్టుకు చెందిన ఈ యువకుడు యర్రావిల్లే రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు చెపుతున్నారు.