భారత్‌తో జరిగే విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు అర్థవంతంగా, ఫలప్రదమైనవిగా ఉండాలని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ వ్యాఖ్యానించింది. ఈ చర్చలకు భారత్ ముందుగా ప్రతిపాదన చేయడం వల్ల కాస్త కఠినంగానే వ్యవహరించాలని భావిస్తున్నట్టు పాక్ వర్గాలు వెల్లడించాయి.
అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి వీలుగా ఫలప్రదమైన చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎటువంటి ఫలితాలనూ సాధించని పరిమితుల్లేని చర్చలను తాము కోరుకోవటం లేదని ఈ వర్గాలు వెల్లడించాయి.
ఉభయ దేశాల సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై భారత్‌తో అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవాలని తాము భావిస్తున్నామని, సమగ్ర చర్చల ప్రక్రియను పునఃప్రారంభించేందుకు భారత్ తిరస్కరిస్తుండటం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయాయని ఈ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ముంబై దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య తొలిసారి జరుగనున్న చర్చల్లో మాత్రం అన్ని అంశాలను లేవనెత్తాలని పాక్ భావిస్తోంది. ఈ చర్చలు కూడా సుహృద్భావ వాతావరణంలో జరగాలని పాక్ ప్రభుత్వం కోరుకుంటున్నట్టు పేర్కొంది.