మానవుని ప్రాథమిక హక్కుల జాబితాలో మరో రెండింటిని ఐక్యరాజ్య సమితి చేర్చింది. సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యంలు ఇందులో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానాన్ని బొలీవియా ప్రతిపాదించింది. తీర్మానానికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, మరో 41 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
సురక్షిత, పరిశుభ్రమైన తాగు నీరు, పారిశుద్ధ్య పరిరక్షణ మానవ హక్కులు. మనిషి పూర్తి ఆహ్లాదకర వాతావరణంలో జీవించడానికి ఇవి చాలా అవసరం అని ఐరాస తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా 88.40 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందడంలేదు.
అలాగే, 260 కోట్ల మంది ప్రజలకు పారిశుద్ధ్య సదుపాయాలు లేవని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 15 లక్షల మంది చిన్నారులు తాగు నీరు, పారిశుద్ధ్య సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్టు ఐరాస వెల్లడించింది.
అందువల్ల పరిశుభ్రమైన తాగునీరు సమకూర్చేందుకు, ప్రతి ఒక్కరికీ పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించేందుకుగాను పేద దేశాలకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు ఈ తీర్మానంలో ఐరాస పిలుపునిచ్చింది.