ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్ చేరుకున్న పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Prime Minister | Republic of Poland | Donald Tusk | visit to India)
పోలండ్ దేశ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ చేరుకున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగే తన పర్యటనలో భారత్‌తో పలు అంశాలు చర్చించనున్నారు. ఇందులో భాగంగా డొనాల్డ్ సోమవారం ప్రత్యేక పోలిష్ విమానంలో బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరులో జరిగే ఓ కార్యక్రమం అనంతరం న్యూఢిల్లీ పయనమవుతారు.
"గతంలో 1995లో జవహర్‌లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీలు పోలండ్‌ను సందర్శించారు. కానీ.. 1979 నుంచి ఇప్పటివరకూ ఏ భారత ప్రధాని పోలండ్‌కు వెళ్లలేదు. ఆ సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు మొరాజి దేశాయ్ అధికారిక పర్యటన నిమిత్తం పోలండ్‌ను దర్శించారు.
పోలండ్‌లో 1989సంవత్సరంలో కమ్యూనిజం పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని పోలండ్‌కు రాకపోవడం ఆశ్చర్యకరం" అని ఇండో-పాలిష్ కల్చర్ కమిటీ అధ్యక్షుడు జానస్జ్ క్రేజీజోవిస్కీ అన్నారు.
2003లో 200 మిలియన్ డాలర్లు ఉన్న ఇండో పాలిష్ వర్తకం 2008 నాటికి 800 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రముఖ ఐటి కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీస్, రిలయన్స్ కంపెనీలు గత ఐదేళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పోలండ్‌లోని స్టీల్ కంపెనీలలో 70శాతం వాటాను భారత్‌కు చెందిన లక్ష్మీ మిట్టల్ నిర్వహిస్తున్నారు.
మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో డొనాల్డ్ టస్క్ బస చేస్తారు. ఈయన పర్యటన సందర్భంగా విదేశాంగ శాక మంత్రి ఎస్ఎమ్ కృష్ణ, యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్‌లను కలుస్తారు. అనంతరం ఎఫ్ఐసీసీఐ, సీఐఐ, అసోచామ్‌లు ఏర్పాటు చేసిన వాణిజ్య సదస్సులో పాల్గొంటారు.