పాకిస్థాన్ మరోమారు ఆత్మాహుతి దాడితో జరిగింది. ఖైబెర్ పఖుతున్‌ఖవా ప్రొవీన్స్‌లోని లఖీ మర్వాత్ పట్టణంలోని పోలీసు స్టేషన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు బడిపిల్లలు కూడా ఉన్నారు. మరికొంత మంది గాయపడ్డారు. గాపడిన వారిలో బడిపిల్లలు, 40 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
కాగా, ఆత్మాహుతి దళ సభ్యుడొకడు కారులో దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ భవనం పూర్తిగా కూలిపోయింది. స్టేషన్‌పైకి దూసుకొచ్చే మార్గంలో ఆత్మాహుతి దళ సభ్యుడి కారు స్కూలు వ్యానును ఢీకొట్టిందని, దీంతో ముగ్గురు బడిపిల్లలు కూడా చనిపోయారని వారు తెలిపారు.
ఇదిలావుండగా, గత వారం రోజులుగా పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వరుస ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటి వరకు 130 మంది వరకు ప్రాణాలు విడిచారు. ఇటీవల సంభవించిన భారీ వరదల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతన్నప్పటికీ.. ఆత్మాహుతి బాంబర్లు మాత్రం యధేచ్చగా దాడులకు పాల్పడుతున్నారు. కాగా, భారీ వరదలకు దాదాపు 1600 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.
ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ పాకిస్థాన్‌లోని చిన్నపాటి స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రైబుల్ ప్రాంతంగా దీనికి పేరుంది. ఇదే ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాకు ప్రధాన స్థావరంగా ఉందని అమెరికా చెపుతోంది. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తాలిబన్, అల్‌ఖైదా తీవ్రవాదులు పాకిస్థాన్‌లో దాడులకు తెగబడుతున్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన వివిధ రకాల బాంబు పేలుళ్ళలో 3360 మంది మృత్యువాత పడ్డారు.