ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » నేపాల్ ప్రధాని ఎన్నిక విఫలం: అనిశ్చితి యధాతథం! (Nepal | PM | Maoists | Prachanda | Ramchandra Powdel | International | India)
దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకోవడంలో నేపాల్ పార్లమెంట్ మరోమారు విఫలమైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ప్రధాని పోటీకి పడిన మావోయిస్టు చీఫ్ ప్రచండ, నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌చంద్ర పౌఢెల్‌లు సంపూర్ణ మెజారిటీని సాధింలేక పోయారు. ఫలితంగా దేశ ప్రధాని ఎంపికలో అనిశ్చితి కొనసాగుతోంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎలాగైనా ప్రధానమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని మావోయిస్టు చీఫ్ ప్రచండ వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఆయనకు బయట నుంచి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే మద్దతు ఇచ్చారు.
గత ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో మావోయిస్టులు తమకున్న 236 మంది ఎంపీలతో పాటు, మరో నలుగురి మద్దతు మాత్రమే కూడగట్టుకోగలిగింది. అధికారాన్ని అధిష్టించడానికి మరో 60 మంది ఎంపీల సహకారం అవసరం కావడంతో మావోయిస్టుల కృషి ఫలించలేదు.
కాగా 101 మంది ఎంపీలు 55 సంవత్సరాల ప్రచండకు వ్యతిరేకంగా ఓటు చేసారు. 163 మంది తటస్థంగా ఉండిపోయారు. ఇక మరో పెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్ తరపున ప్రధాని పదవికోసం యత్నిస్తున్న రాంచంద్ర పౌడెల్‌కు అనుకూలంగా 122 మంది, వ్యతిరేకంగా 242 మంది ఓటు చేయగా 172 మంది తటస్థంగా ఉన్నారు.
ప్రధాని ఎంపికలో ఆరుసార్లు స్పష్టమైన మెజారిటీ రాకపోవడానికి భారతేనని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఎన్నిక విఫలం కావడానికి భారత్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ యత్నిస్తున్నదని ఆరోపించారు. ఈ ఎన్నిక మొత్తం క్రాస్ ఓటింగ్, హార్స్ ట్రేడింగ్‌లు, వెన్నుపోట్లతో నిండిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదని మావోయిస్టులు ఆరోపించారు.