పాకిస్థాన్‌లో సంభవించిన భారీ వరదల్లో 1750 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ వెల్లడించారు. ఈ వరదలు దేశంలోని 124 జిల్లాల్లో 79 జిల్లాల్లో అపారనష్టం వాటిల్లిందని చెప్పారు. వరదల వల్ల 1.30 మిలియన్ ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు. బ్రిడ్జిలు, రోడ్లు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు భవంతులు కూలిపోయాయని చెప్పారు. వరద సహాయ చర్యలు, పంట నష్టంపై చర్చించేందుకు ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం ఆయన వరద నష్టం వివరాలను వెల్లడించారు.
తాను పర్యటించిన వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషాదపూరితంగా ఉందన్నారు. అనేక మంది ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. దాదాపు 2600 మంది గాయపడినట్టు వార్తలు ఉన్నాయని ఆయన తెలిపారు. వరదల వల్ల సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన 3,60,000 మందిని ఆదుకునేందుకు ప్రభుత్వ వర్గాలు అన్ని రకాల చర్యలు చేపట్టాయని గిలానీ తెలిపారు.