భారత్-అమెరికా అణు ఒప్పందంపై భవిష్యత్ ప్రణాళికను ఖరారు చేసేందుకు 85 మంది సభ్యులతో కూడిన సీపీఎం కేంద్ర కమిటీ బుధవారం దేశ రాజధానిలో సమావేశంకానుంది. గత 18వ తేదీన సమావేశమైన ఆ పార్టీ పోలిట్‌బ్యూరో.. 123 ఒప్పందాన్ని అమలు చేసిన పక్షంలో కేంద్రంలోని యూపీఏ సర్కారు తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం తెల్సిందే.
ఒక వేళ ప్రభుత్వం ముందుకు వెళ్లిన పక్షంలో మద్దతును ఉపసంహరించుకోవాలని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ యూపీఏ భవితవ్యంపై ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది. అయితే లెఫ్ట్ పార్టీల హెచ్చరికలను పెద్దగా పట్టించుకోని ప్రధాని మన్మోహన్ సర్కారు అణు ఒప్పందంపై ముందుకు సాగేందుకే మొగ్గుచూపుతోంది.
అయితే వామపక్ష వృద్ధ నేత జ్యోతిబసు గత సోమవారం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టడమే తమ ప్రధాన లక్ష్యం కాదని, ప్రభుత్వం-లెఫ్ట్ పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
అలా వ్యాఖ్యానించిన రోజే.. మరో పోలిట్‌బ్యూరో ఎంకే.పాండే మాట్లాడుతూ.. మద్దతు ఉపసంహరించుకోవడం మినహా వామపక్షాలకు మరో దారిలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
|