కర్ణాటకలో అధికార బదలాయింపు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భాజపాతో కుదుర్చుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రస్తుత పరిస్థితుల్లో చెల్లుబాటు కాదని జేడీ(ఎస్) అధినేత దేవగౌడ ప్రకటించి 24 గంటలకు కాకమునుపే రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి తండ్రి పాటకు వంత పాడారు.
అసలు అధికార బదలాయింపు ప్రస్తావనను భారతీయ జనతా పార్టీ తమ ముందుకు తీసుకురాలేదని సీఎన్ఎన్- ఐబీఎన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీడియా ఆసరాగా చేసుకుని అధికార బదలాయింపు కోసం భాజపా సీనియర్ నేతలు అవలంబిస్తున్న వైఖరి తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.
భాజపా నేతల ప్రవర్తన భవిష్యత్తులో పలు దుష్పరిణామాలకు ఊతమిస్తుందని కుమారస్వామి జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం జరుగనున్న జేడీ(ఎస్) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అధికార బదలాయింపుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారు.
|