నందిగ్రామ్‌లో భూసేకరణ జరిపే ప్రసక్తి లేదని సీపీయం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ సోమవారం స్పష్టం చేశారు. నందిగ్రామ్‌పై అనవసర రాద్దాంతం జరుగుతున్నదని ప్రకాష్ కారత్ అన్నారు. నందిగ్రామ్ వ్యవహారంతో పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సోమవారం న్యూఢిల్లీలో సమావేశమైంది.
సమావేశం ముగిసిన అనంతరం ప్రకాష్ కారత్ మీడియాతో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నందిగ్రామ్‌ను రక్తసిక్తం చేశాయని అన్నారు. భూసంరక్షణ కోసం ఏర్పాటైన భూమి ఉచ్చేడ్ పరిటిరోడ్ కమిటీ మావోయిస్టులతో కుమ్మకై నందిగ్రామ్‌ను ఆక్రమించుకున్నదని కారత్ తెలిపారు.
నందిగ్రామ్‌లో ఆయుధాలను కలిగిన మావోయిస్టుల ఉనికిని జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఎస్ఏ)కు చెందిన ఎంకే. నారాయణన్ సైతం నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల సహకారంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కారత్ ఆరోపించారు.
|