సోమవారం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొనక మునుపే భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తాము రూపొందించిన 12 అంశాల పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలని జనతాదళ్ (ఎస్) శాసనసభా పక్షం సమావేశం తీర్మానించింది.
అలా కాని పక్షంలో పార్టీ అధినేత హెచ్‌డీ దేవగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామిలు ప్రభుత్వానికి మద్దతుపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం ప్రతిపాదించింది. దీంతో బీఎస్.యెడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం డోలాయమాన పరిస్థితిలో పడింది. అత్యంత కీలకమైన జేడీ (ఎస్) శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరిగింది.
ప్రభుత్వం సాఫీగా కొనసాగేందుకు ఒప్పందం యొక్క పాత్రను పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులకు వివరించారని కుమార స్వామి మీడియాతో అన్నారు. ఒప్పందంపై భాజపా అంగీకరించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణపై ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
|