తమ సహచరులకు మరణశిక్షను విధించడాన్ని నిరసిస్తూ మావోయిస్టు గెరిల్లా దళం సభ్యులు బీహార్‌లోని లఖిసరాయి జిల్లాలోని రెండు ప్రాంతాలలో బుధవారం తెల్లవారుఝామున రైలు పట్టాలను పేల్చివేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. గత వారం బంక జిల్లాలో ముగ్గురు పోలీసులను హత్య చేసిన ఐదుగురు మావోయిస్టులకు న్యాయస్థానం మరణశిక్ష విధించిన సంగతి విదితమే.
తూర్పు మధ్య రైల్వే పరిధిలోని ఝఝా సెక్షన్‌లో గల భాల్యయి హాల్ట్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను తెల్లవారుఝామున రెండు గంటలకు మావోయిస్టులు పేల్చివేసారని తూర్పు మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏకే.చంద్ర మీడియాతో అన్నారు. మావోయిస్టుల విధ్వంసక చర్యతో పాట్నా-హౌరా ప్రధాన మార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా మరో సంఘటనలో తూర్పు రైల్వే పరిధిలోని కౌల్-జమల్‌పూర్ సెక్షన్‌లో గల కజ్రా మరియు యురియన్ స్టేషన్ల మధ్య గల రైలు పట్టాలను బుధవారం ఉదయం 03.45 ని.లకు మావోయిస్టులు పేల్చివేసారని తూర్పు ర్వైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి దీపక్ ఝా తెలిపారు.
|