ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. గత ఏడాది నవంబరు ఏడో తేదీన ముంబై సబర్బన్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్లలో 186 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసు విచారణ కోసం మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది.
ఈ కేసు విచారణ చేపట్టిన ముంబై పోలీసులు మొత్తం 28 మందిపై అభియోగాలు నమోదు చేసి, ఛార్జిషీటును దాఖలు చేశారు. ఈ నిందితుల్లో 15 మంది పరారీలో ఉండగా, మిగిలిన 13 మంది నిందితులు విచారణ ఎదుర్కొననున్నారు. పారిపోయిన వారు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.
అయితే నిందితుల విచారణ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. మధ్యలో పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఎంసీఓసీఏ న్యాయమూర్తి ఎం.ఆర్.భట్గర్ బదిలీ వీటిలో కీలకం. అయితే.. ఈయన పెట్టుకున్న బదిలీ వినతి పత్రాన్ని ముంబై హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో తొలుత నిర్ణయించినట్టుగానే ఈ వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణ మంగళవారం (18వ తేదీ) నుంచి ప్రారంభంకానుంది.
|