ఒక వైపు దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కోలాహలంగా సాగుతోంది. అయితే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ బోసిపోయింది. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో మునుపటి సంక్రాంతి ఉత్సాహం యువకుల్లో కనిపించలేదు. కారణం.. తమిళుల సంప్రదాయంలో ఒక భాగమైన సాహస క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడం వారిని కలసివేసింది. దీంతో దక్షిణాది జిల్లాల్లో సంక్రాంతి పండుగ ఉప్పులేనికారం లేని 'పొంగల్'గా సాగింది. మరికొన్ని గ్రామాల్లో సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ పండుగను జరుపుకోలేదు.
ముఖ్యంగా జల్లికట్టు క్రీడకు ప్రపంచ స్థాయిలో వేదికగా నిలిచే అలంగానల్లూరు, పలమేడు ప్రాంతాల వాసులు సంక్రాంతి రోజును నిరసన దినంగా జరుపుకున్నారు. తమ ఇళ్ళపై నల్లటి జెండాలను ఎగురవేశారు. ఈ సాహస క్రీడపై విధించిన నిషేధాన్ని తక్షణం ఎత్తివేయాలని ఆ గ్రామాల వాసులు నిరసన దినాన్ని అనుసరిస్తున్నారు. ఇదిలావుండగా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ తమిళ సంప్రదాయ క్రీడ ఇంతటితో అంతరించి పోకుండా ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.
|