ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ ప్రభుత్వం తమను గృహ నిర్భంధంలో వుంచిందని ఆయన ఆరోపించారు. మాయావతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశాయి. అలాగే యూపీ ప్రభుత్వం కూడా వాటికి వెన్నుదన్నుగా నిలిచింది. అయితే ఈ వేడుకలకు నిరసనగా ఎస్పీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో పుట్టిన రోజు వేడుకలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా వుండేందుకు యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. దీనిపై ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తన నివాసం చుట్టుపక్కల భారీ స్థాయిలో పోలీసు బలగాలను మొహరించారు. మమ్మలను ఇంటిలోనే బంధించారు. పార్టీ అఫీసుకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకుండా చేశారు. బయటకు వెళ్లేందుకు అనుతి ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తమ పార్టీ కార్యకర్తలను, నేతలను కూడా భారీ సంఖ్యలో అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.
|