పాకిస్తాన్ తాజాగా ప్రయోగించిన ఘోరీ క్షిపణి ప్రయోగం వల్ల భారత్‌కు కలిగే నష్టమేమీ లేదని దేశ రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ముఖ్య నియంత్రణాధికారి, పద్మశ్రీ ఎ.శివథాను పిళ్లై అభిప్రాయపడ్డారు. చర్మశాస్త్రవేత్త డాక్టర్ యలపర్తి నాయుడమ్మ అవార్డును శివథాను పిళ్లైకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఘోరీ క్షిపణి లక్ష్యం 1300 కిలోమీటర్లు మాత్రమేనని, భారత రక్షణ వ్యవస్థలో 3500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఘోరీ భారతదేశంలోని ఒక ముఖ్య నగరాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోగలదని వ్యాఖ్యానించారు. అందువల్ల పాక్ క్షిపణుల ప్రయోగాన్ని చూసి మనం బెదిరిపోవాల్సిన పని లేదన్నారు. మరో పుష్కరకాలంలో భారత్ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో మూడోదిగా ఆవిర్భవించడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|