టిక్కెట్ల రిజర్వేషన్ కోసం స్మాట్‌కార్డు విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్‌లలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదప్ ప్రకటించారు. అలాగే దేశంలోని ఏ, బి కేటగిరీ రైల్వే స్టేషన్‌లలో టచ్ స్క్రీన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఈ సౌకర్యంతో పాటు కలర్ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. ముంబై రైళ్ళ కోసం "గో ముంబై" కార్డులను అన్ని బస్సు డిపోలలో విక్రయించనున్నట్టు తెలిపారు. ప్యాసింజర్ రైళ్ళ ద్వారా ఆదాయం 14 శాతం మేరకు పెరిగినట్టు లాలూ తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం దూరప్రాంత రైళ్ల రాకపోకలు తెలుసుకునేందుకు వీలుగా డిస్‌ప్లే బోర్డులను రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఉత్తర భారతంలో సింహభాగం రైల్వే లైన్లను విద్యుదీకరణ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే రిజర్వేషన్ టికెట్లపై రైలు వచ్చే (అరైవల్ టైమ్) సమయాన్ని ముద్రించనున్నట్టు చెప్పారు. గత నాలుగేళ్ళలో రైల్వే శాఖలో 68,778 కోట్ల రూపాయల మిగులు సాధించినట్టు ప్రకటించారు. ఇంటర్నెట్ ద్వారా ప్రయాణికులు ఈ-టిక్కెట్లు పొందవచ్చు. ఆటోమేటిక్ టిక్కెట్ యంత్రాలను ఆరు వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు.
|