గుజరాత్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కనీసం 50 మంది విద్యార్థులతో కూడిన పాఠశాల బస్సు నర్మదా నది కాలువలో బోల్తా పడింది. ప్రాథమిక సమాచారం మేరకు నలభై మందికి పైగా మృతి చెందగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ తెలియలేదు. వడోధరాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడేలి అనే ప్రాంతంలో ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. స్టడీ టూర్‌లో ఉన్న విద్యార్థుల బస్సు నర్మదా నది కాలువ బ్రిడ్జిపై వెళుతుండగా బ్రిడ్జిని ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది.
ఇప్పటి వరకు బస్సు డ్రైవర్‌తో సహా నలభై మృతదేహాలను వెలికి తీశారు. గుజరాత్ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు 50-55 మంది విద్యార్థులతో స్టడీ టూర్ కోసం బయలుదేరింది. ఇందులోని విద్యార్థులందరూ ఐదు నుంచి 11వ తరగతి చదివే విద్యార్థులే. వీరంతా టర్పోడ్ నుంచి బొడేలికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఆ ప్రాంత డీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
మృతదేహాల కోసం 20 మంది ఈతగాళ్లు గాలిస్తున్నట్టు తెలిపారు. అలాగే సమీప ప్రాంతంలోని గ్రామ ప్రజలు కూడా సహాయం అందించారన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే ఐదుగురు విద్యార్థులు ఈతకొట్టుకుంటూ గట్టుపైకి వచ్చి ప్రమాద వార్తను చేరవేశారని వివరించారు. అలాగే.. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కూడా పోలీసులకు సమాచారాన్ని చేరవేసినట్టు తెలిపారు.
|