గుజరాత్ రాష్ట్రంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 44కు పెరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న బస్సు వడోధరా జిల్లాలోని బొడేలి గ్రామం వద్ద 60 అడుగుల లోతు గల నర్మదా నది కాలువలో బోల్తా పడిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో మొత్తం 44 మంది మృతి చెందినట్టు, మృతుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. వీరంతా పది నుంచి 14 సంవత్సరాల విద్యార్థులే. కాలువలో ఉన్న మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు వడోధర డీఎస్పీ విశ్వకరమ వెల్లడించారు.
అయితే బస్సు ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు విద్యార్థులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని జిల్లా కలెక్టర్ విజయ్ నెహ్రా తెలిపారు. గుజరాత్ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు తర్గోల్ నుంచి బొడేలికి పాఠశాల విద్యార్థులతో విద్యా విహారయాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 32 మంది బాలికలు, తొమ్మిది మంది బాలురు, బస్సు డ్రైవర్, క్లీనర్, ఒక టీచర్ ఉన్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగా, వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుండగా ఈ ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి, మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాద స్థలానికి ఇద్దరు కేబినెట్ మంత్రులు తరలి వెళ్లారు. వెలికి తీసిన మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
|