దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తుల ధరలపై వామపక్షాలు, యూఎన్‌పీఏ నేతలు చేతులు కలిపారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించింది. ముఖ్యంగా నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా.. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. దీంతో కేంద్రానికి బయటి నుంచి మద్దతునిస్తున్న వామపక్షాలకు, భాజపాయేతర ప్రతిపక్షాలకూ మధ్య దూరం తగ్గుతోంది.
మరీ ముఖ్యంగా తెలుగుదేశం, వామపక్ష పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు బలపడుతున్నాయి. అందుకు శనివారం నాటి హస్తిన దృశ్యమే ఉదాహరణ. ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగోలేదని వామపక్షాలు కొంతకాలంగా కేంద్రాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే 15 రోజుల క్రితం వరకూ కేంద్రానికి ఈ హెచ్చరికలు వినిపించలేదు. ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తారాజువ్వలా లేచేసరికి పరిస్థితి చేజారి పోయింది. సరిగ్గా అదే పరిస్థితిని యు.ఎన్.పి.ఎ. నాయకత్వంలోని ప్రతిపక్షాలు తమకు అనుగుణంగా మార్చుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.
ఇటు యు.ఎన్.పి.ఎ. అటు వామపక్షాలూ కలిసి శనివారంనాడు ధరల పెరుగుదల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలో సమైక్య గళం వినిపించాయి. మతతత్వ భావజాలానికి దూరంగానే ఉన్నామని, భవిష్యత్తులో వారి దరిదాపులకే వెళ్లబోమనీ వామపక్షాలకు చెప్పకనే చెప్పదలచిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని వ్యూహాత్మకంగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
|