ఉత్తరాఖండ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు తొలి దశ ట్రెండ్‌లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు అన్ని చోట్లా ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, 32 పురపాలక, 27 నగర పంచాయతీలకు ఈనెల 19వ తేదీన ఎన్నికలు జరిగాయి.
ఈ స్థానాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి వినోద్ ఛమోలి (భాజపా), సూరత్ సింగ్ నెగి (కాంగ్రెస్), స్వతంత్ర అభ్యర్థి రజ్నీ రావత్‌ల మధ్య తీవ్రమైన ముక్కోణపు పోటీ నెలకొంది. మొత్తం 32 పురపాలక సంస్థలు గాను మూడింటింకి ఎన్నికలు జరుగలేదు. మిగిలిన స్థానాల్లో 80 శాతం మేరకు సీట్లు సాధిస్తామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన బలాన్ని ఈ ఎన్నికల్లో తిరిగి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నంబవర్ వన్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని, ప్రజల మద్దతును పొందేందుకు ఈ ఎన్నికల్లో గట్టిగా కృషి చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. ఇదిలావుండగా ఈ ఎన్నికల్లో 3405 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
పోలింగ్ జరిగే ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారినే లోనికి అనుమతిస్తున్నారు. బందోబస్తు చర్యల్లో భాగంగా మొబైల్స్, కెమరాలు, అగ్గిపెట్టెలతో పాటు ఇతర వస్తు సామాగ్రిని కౌంటింగ్ కేంద్రంలో నిషేధించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది ఫలితం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వెల్లడికావచ్చు.
|