దేశ రక్షణ దళాల సిబ్బందికి సముచిత వేతనం అందేలా కృషి చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అఖిల భారత సర్వీసుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. రక్షణ దళాల సిబ్బందికి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా వారికి సముచిత వేతనాలు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆరో వేతన సంఘం సమర్పించిన నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించిన రక్షణ శాఖాధిపతులు రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీని కలసి ఒక వినతి పత్రం సమర్పించిన విషయం తెల్సిందే. ఆరో వేతన సంఘం చేసిన సిఫార్సులతో ఏకీభవించని పలువురు ఉన్నతాధికారులు రక్షణ శాఖను వదిలి వెళ్లిపోతున్నారని, అందువల్ల సరైన వేతనాలు దక్కేలా చూడాలని త్రివిధ దళాధిపతులు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని వారిని ఓదార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అలాగే సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అఖిల భారత సర్వీసుల అధికారులు విధులు నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పిల్లల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న భారత్ నిర్మాణ్, జాతీయ ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల పట్ల సానుకూల స్పందన కనిపిస్తున్నా, దేశ వ్యాప్తంగా ఒకేలా అమలు కావడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
|