భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం అర్థరహితమని జాతీయ భద్రతా మాజీ సలహాదారు బ్రిజేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అణు ఒప్పందంపై తన మనస్సులోని మాటను వ్యక్తం చేశారు.
అణు ఒప్పందాన్ని అమలు చేయకుంటే భారత్ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అన్నారు. అందువల్ల ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ కాలంలోనే అమలు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని ఆయన పిలునిచ్చారు. అమెరికాలో ప్రభుత్వం మారిన పక్షంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అంతేకాకుండా ఒప్పందం వల్ల మన అణు కార్యక్రమాలకు ఎలాంటి విఘాతం కలుగబోదన్నారు.
ఈ విషయం మన ప్రభుత్వ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేశారని మిశ్రా తెలిపారు. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మిశ్రా జాతీయ భద్రతా మాజీ సలహాదారునిగా ఉన్న విషయం తెల్సిందే. భారతీ జనతా పార్టీ అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో బ్రిజేష్ మిశ్రా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్డీయే నేతలను సందిగ్ధంలో పడేశాయి. అణు ఒప్పందం అమలుకు వచ్చినా అణు పరీక్షలను నిర్వహించుకోవచ్చన్నారు. అయితే భారత్ అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (సిటిబిటి) సంతకం చేయాలని మిశ్రా అభిప్రాయపడ్డారు.
|