అభివృద్ధి ఫలాలను షెడ్యూల్ కులాలు, తెగలు, మైనారిటీ ప్రజలకు చేరవేయడంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆయన ఆదివారం నుంచి మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. భాజపా పాలిత రాష్ట్రాల్లో పేదలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఫలాలు దక్కడం లేదని విమర్శించారు.
ముఖ్యంగా కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల పేర్లు కూడా ఆయా రాష్ట్రాల్లోని గిరిజనులు వినలేదని చెపుతున్నారన్నారు. దీన్ని బట్టి చూడగా భాజపా పాలిత రాష్ట్రాలు గిరిజనులు, షెడ్యూల్, మైనారిటీ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ హక్కుల కోసం గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు.
|