తమ తదుపరి లక్ష్యం చంద్ర మండలంపై అడుగు పెట్టడమేనని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ-సి9 రాకెట్ ద్వారా స్వదేశీ, విదేశాలకు చెందిన పది ఉప గ్రహాలను రోదసీ కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ అపూర్వ ఘట్టానికి నెల్లూరు జిల్లా, శ్రీహరి కోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) వేదికైంది.
భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన రోజుగా సోమవారం (ఏప్రిల్ 28వ తేది) నిలిచిపోయింది. ఈ ప్రయోగం విజయంతంగా పూర్తి చేయడంతో ప్రపంచ అంతరిక్ష మార్కెట్ యావత్తును భారత్ ఒక్కసారి తన వైపుకు తిప్పుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ అనంతరం ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ ద్వారా పది ఉపగ్రహాలు నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఈ ప్రయోగం విజయానికి కారకులైన ప్రతి శాస్త్రవేత్తకు, షార్ కేంద్ర ప్రతినిధులను నాయర్ పేరు పేరునా అభినందంచారు. 600 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్రో.. తదుపరి లక్ష్యం చంద్రమండలంపై అడుగు పెట్టడమేనని నాయర్ ప్రకటించారు.
|