వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆయన మంగళవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీయే నియమ నిబంధనలకు లోబడి మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పొత్తు పెట్టుకునేందుకు సముఖంగా ఉన్నామన్నారు.
అలాగే దేశంలో పెరిగి పోయిన నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే కేంద్రానికి వ్యతిరేకంగా తమ పార్టీ జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సేతు సముద్ర ప్రాజెక్టు కోసం వేలాది సంవత్సరాల క్రితం శ్రీరాముడు నిర్మించిన రామసేతు వారధిని కూల్చేందుకు తాము అంగీకరించబోమన్నారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రాజెక్టుకు గత ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది కదా అని విలేకరులు ప్రశ్నించగా, సమాధానం ఇచ్చేందుకు రాజ్‌నాథ్ నిరాకరించారు.
|