ఎన్నో అవరోధాల అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టకేలకు స్టాండింగ్ కమిటీ పరిశీలనార్థం పంపారు. ఈ కమిటీ బిల్లుపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి తిరిగి పంపుతుంది.ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టి, రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వాయలార్ రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల సంపూర్ణ మద్దతు మేరకు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
ఈ బిల్లుకు సోమవారమే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును సభలో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా ఎస్పీ ఎంపీలు చేసిన అల్లరిపై మంత్రి రవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సభలో తమ నిరసనలు వ్యక్తం చేయవచ్చు. కానీ, మంత్రిపై కండ బలం ప్రదర్శించేందుకు పూనుకోవడం దురదృష్టకరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపామని ఆయన చెప్పారు.
|