ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై చర్య తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ బుధవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర డీజీపి ఏఎన్.రాయ్, ముంబై నగర పోలీసు కమిషనర్ హాసన్ గఫూర్, జాయింట్ కమిషనర్ కేఎల్.ప్రసాద్‌లతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
స్థానికేతరులు తక్షణం మహారాష్ట్రను వీడి వెళ్లి పోవాలని రాజ్‌థాక్రే హెచ్చరించిన విషయం తెల్సిందే. రాజ్‌థాక్రే పిలుపుతో రెచ్చిపోయిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు స్థానికేతరులపై ముఖ్యంగా ఉత్తర భారతీయులపై దాడులకు దిగిన విషయం తెల్సిందే. ఇవి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో రాజ్‌థాక్రేను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆయన విడుదలయ్యారు. అయినప్పటికీ రాజ్‌థాక్రే తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ఈ పరిస్థితుల్లో రాజ్‌థాక్రేపై తగిన చర్య చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఉన్నతాధికారులతో కలసి కీలక సమావేశం నిర్వహించనున్నారు.
|