పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగే సంఘటనలు దేశ ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. వామపక్షాల పాలనలో ఉన్న ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ.. అపుడపుడూ దేశ మీడియాను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నందిగ్రామ్ ఘర్షణలు రాష్ట్ర చరిత్రకు మాయని మచ్చగా మిగిలాయి. ఇదిలావుండగా తాజాగా మరో సంఘటన జరిగింది. ఇది రాజకీయ నేతలకు కనువిప్పు కలిగించే చర్య.
సాధారణంగా దేశ ప్రజలు విద్యుత్ కోతను ఎదుర్కోవాల్సిందే. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రం ఇది మినహాయింపు. వీరు నివశించే ప్రాంతాల్లో విద్యుత్ కోత విధిస్తే మరు క్షణమే అక్కడ విధులు నిర్వహించే విద్యుత్ సిబ్బంది బదిలీ కావడమో లేదా సస్పెండ్‌కు గురికావడమే జరుగుతుంది.
కానీ.. పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ గాంధీ.. సాధారణ ప్రజలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించారు. నందిగ్రామ్ ఘర్షణల సమయంలో ప్రోటోకాల్‌ను తోసిరాజని బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి విచారణ చేపట్టారు. ఈ చర్య దేశంలోని గవర్నర్ వ్యవస్థను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా రాజ్‌భవన్‌లో కూడా విద్యుత్ కోతను అమలు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచే అమలు చేయాలని పేర్కొన్నారు. రోజుకు కనీసం రెండు గంటల చొప్పున విద్యుత్ కోత విధించాలని ఆయన రాజ్‌భవన్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. దైనందిన జీవితంలో భాగంగా.. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ కోత విధిస్తున్న విషయం తెల్సిందే.
ఈ కోతకు రాజ్‌భవన్ ఏమాత్రం మినహాయింపు కాబోదని అందువల్ల అధికారులు తమకు ఎపుడు అవసరమైతే అపుడు విద్యుత్ కోతను అమలు చేయవచ్చని గవర్నర్ ఆదేశించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఇంటిపేరును తన పేరులో పెట్టుకున్న గోపాలకృష్ణ గాంధీని.. దేశంలోని రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గదర్శకంగా తీసుకుంటారని ఆశిద్దాం.
|