కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, అందువల్ల వారు కాషాయానికి పట్టం కడుతారని మోడీ అభిప్రాయపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూ ఆయన గురువారం హైదరాబాద్‌లో దిగారు. ఈ సందర్భంగా మోడీ కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.
నమ్మక ద్రోహం చేసిన జనతాదళ్ ఎస్‌కు, స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెపుతారని మోడీ సెలవిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి యడ్డియూరప్ప నేతృత్వంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిర పాలన అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్డీయే విజయం సాధిస్తుందని మోడీ జోస్యం చెప్పారు. రాయచూర్ నుంచి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
|