కర్ణాటక రాష్ట్ర విధాన సభకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 89 నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.
మొత్తం 2,46,58,539 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 89 నియోజకవర్గాల్లో కలిపి 18,533 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానాల్లో 953 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటక విధాన సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న విషయం తెల్సిందే.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎస్ఎంకృష్ణ, కేపీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే తదితరులు ప్రచారం చేశారు. అలాగే భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనేత అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుష్మాస్వరాజ్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అరుణ్ జైట్లీలు ముమ్మర ప్రచారం చేశారు.
తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగే 89 స్థానాల్లో యాభై సీట్లను దక్కించుకుంటామని మూడు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో సాంగేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను బందోబస్తుగా నియమించారు.
|