కర్ణాటక విధానసభకు జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. మొత్తం 89 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో 400 మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా 953 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 11 జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్ జరుగుతుండగా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్-ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బీఎస్పీ కూడా 86 నియోజకవర్గాల్లో పోటీ చేసింది.
పోలింగ్ కోసం మొత్తం 18,562 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 6,252 పోలింగ్ కేంద్రాల ఉన్న ప్రాంతాలను సమస్యాత్మకంగాను, మరో 3,500 పోలింగ్ బూత్‌లు సున్నిత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది సిబ్బంది నిమగ్నమైవున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు వీలుగా ఎన్నికల బందోబస్తు కోసం 58 వేల మంది పోలీసు బలగాలను నియమించారు. ఇదిలావుండగా మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు కలిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో రెండో దశ ఈనెల 16వ తేదీన, మూడో దశ 22వ తేదీన పోలింగ్ జరుగనుంది.
|