భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై ఎలాంటి అనుమాలు, సందేహాలు పెట్టుకోవద్దని భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం భరోసా ఇచ్చారు. ఈ ఒప్పందం అమలుకు వస్తే దేశ అవసరాలకు సరిపడ అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా అణు ఒప్పందం అమలుకు అంగీకరిస్తే దేశ సౌరభౌమాధికారాన్ని తాకట్టు పెట్టినట్టుగా భావించరాదని, భవిష్యత్‌లో అణు ఒప్పందం వల్ల దేశ భద్రతకు ముప్పు అని భావించిన మరుక్షణమే ఒప్పందం నుంచి తప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఇతర దేశాలతో సరితూగినపుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారని కలాం ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
గత 1991 ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎనలేని మేలు చేశాయన్నారు. వీటి ఫలితంగా అణ్వస్త్ర రంగంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుందన్నారు. అయితే 1998 తర్వాత మనం కొన్ని ఆర్థిక, సాంకేతిక పరమైన ఆంక్షలు చవి చూసినప్పటికీ ఏదైనా మనం సాధించగలం అనే ఆత్మవిశ్వాసం పెరిగిందని అబ్దుల్ కలాం పేర్కొన్నారు.
|