ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మందుపాతరలు పేల్చారు. ఈ పేలుళ్ళలో కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భైరాన్‌గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిహానే గ్రామ సమీపంలో వీరిద్దరు ప్రయాణించబోయే ముందు ఈ పేలుళ్లు సంభవించాయి. శివరాజ్ పాటిల్ ప్రయాణించాల్సిన రహదారిలో వరుసగా ఏడు మందు పాతరలు పేల్చారు. ఆ సమయంలో కాన్వాయ్ అక్కడకు చేరుకోక పోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
కూంబింగ్ బృందాలను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుళ్లు జరిగినప్పటికీ, ఏ ఒక్కరూ గాయపడలేదు. ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న దండకారణ్యం పరిధిలోని పామేడు (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం) పోలీసు స్టేషన్‌ను శివరాజ్ పాటిల్, రమణ్ సింగ్‌లు సందర్శించారు. వారు పర్యటన ముగించుకొని తిరిగి వెళుతుండగా ఈ పేలుళ్లు జరిగాయి.
పేలుళ్ళ అనంతరం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు బైరాన్‌గఢ్ ఇంద్రావతి లోకల్ గెరిల్లా బృందం కమాండర్ కుహరానీ పాండే అలియాస్ సుకుమతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నుంచి కొన్ని మందుపాతరలు, మూడు ప్రెషర్ బాంబులు, ఐదు డిటోనేటర్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
|