రాజస్థాన్ రాజధాని జైపూర్ మంగళవారం సాయంత్రం జరిగిన వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని సమాచారం. పర్యాటకులు ఎక్కువగా సంచరించే జోహ్రి బజార్, సాంగనేర్ గేట్, మానిక్ చౌక్‌లోని హనుమాన్ మందిర్, ట్రిపోలియా బజార్‌లలో ఈ పేలుళ్లు జరిగాయి.
పేలుడు వివరాలు తెలుసుకున్న రాజస్థాన్ డీజీపీ ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అజ్మీర్ పేలుళ్లు జరిగిన ఏడు నెలలు తర్వాత ఈ దాడి జరగటం గమనార్హం. దాడిలో భారీ విధ్వంసాన్ని సృష్టించే పేలుడు పదార్ధాలను వినియోగించారని ప్రాథమిక సమాచారం.
పేలుడును దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయిలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలెర్ట్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
|